
తెలంగాణ యాస అంటే నవ్వుతారన్నారట
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ యాస పట్ల చిన్నచూపు ఉండేదన్నది వాస్తవం. కామెడీ.. విలన్ క్యారెక్టర్లకే ఎక్కువగా ఆ యాస వాడేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ యాసతో క్యారెక్టర్లు బాగానే వస్తున్నాయి. హీరోలు కూడా ఆ యాసను ఉపయోగిస్తున్నారు. చిన్నా చితకా క్యారెక్టర్లకు విలన్, కామెడీ పాత్రలకు ఆ యాస పెట్టడం తగ్గింది. ఐతే తెలంగాణ యాసకు తెలుగు సినిమాల్లో మంచి పాపులారిటీ తెచ్చిపెట్టి.. క్యారెక్టర్లను పండించిన నటుల్లో కోట శ్రీనివాసరావు తర్వాత చెప్పుకోవాల్సిన పేరు తనికెళ్ల భరణిదే. యమలీల.. నువ్వు నేను లాంటి సినిమాల్లో ఆయన తెలంగాణ యాసతో చేసిన క్యారెక్టర్లు భలేగా పేలాయి. 'మొండిమొగుడు పెంకి పెళ్లాం' సినిమాలో హీరోయిన్ పాత్రకు తొలిసారి తెలంగాణ యాసతో డైలాగులు రాసిన ఘతన కూడా భరణిదే. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు భరణి.
''మాది ఆంధ్రా ప్రాంతమే అయినా.. మా నాన్న 1939లో ఒక దొర కొడుకుకి ట్యూషన్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చాడు. నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్లో. కాబట్టి తెలంగాణ భాష.. యాస మీద పట్టు దొరికింది. పరిపూర్ణమైన సాధికారత లేకపోతే ఏ భాషైనా వేళాకోలంగా అనిపిస్తుంది. చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో తెలంగాణ భాషకి అలాగే జరిగింది. నేను ఇండస్ట్రీకొచ్చాక.. 'మొండిమొగుడు పెంకి పెళ్లాం' సినిమా స్క్రిప్టు నా దగ్గరికొచ్చింది. అందులో ముందు హీరోయిన్కు శ్రీకాకుళం యాసలో మాటలు రాయమన్నారు. నాకు ఆ భాష మీద పట్టు లేదు. నేను తెలంగాణ యాసలో రాస్తానని చెప్పాను. అలా రాస్తే నవ్వుతారేమో కదా అన్నారంతా. కానీ నేను కొన్ని సీన్లు రాశాక మీరే చెప్పండన్నాను. కోర్టు సీన్ రాసి చూపించా. ఆ డైలాగులు విని అందరూ కన్నీళ్లు పెట్టారు. ప్రతీ యాసకూ ఒక పరిమళం ఉంటుంది.. అన్ని మాండలికాల్లోనూ అన్ని రసాలూ పలుకుతాయని నిరూపించా'' అని వెల్లడించారు భరణి
No comments:
Post a Comment