
కోళ్ల ఫారం నడుపుతున్న జగపతి
జగపతి బాబు హవా మామూలుగా లేదిప్పుడు. తెలుగులో విలన్.. క్యారెక్టర్ రోల్స్‌తో తన కెరీర్‌ను మలుపు తిప్పుకుని గొప్ప స్థాయిని అందుకున్న జగపతి.. ఇప్పుడు పొరుగు భాషల్లో కూడా జోరు చూపిస్తున్నాడు. ఈ మధ్యే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో ఆయన చేసిన ‘పులి మురుగన్’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. మలయాళ ఇండస్ట్రీలోనే తొలిసారి రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో జగపతి నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు తమిళంలో మరో భారీ సినిమాతో పలకరించబోతున్నాడు జగపతి. సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘భైరవ’లో జగపతే విలన్. దీని టీజర్ దీపావళి కానుకగా రిలీజైంది.
టీజర్ చూస్తుంటే విజయ్ మార్కు పక్కా మాస్ మసాలా సినిమాలా ఉంది ‘భైరవ’. నిమిషం నిడివి ఉన్న టీజర్లో విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికే ప్రయత్నం జరిగింది. పంచ్ డైలాగులు పేలిపోయాయి. సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ నిర్మించడం విశేషం. సీనియర్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర విషయానికి వస్తే.. ఆయన్ని ఓ కోళ్ల ఫారంలో చూపించారు. కోపంగా ఫోన్లో యార్రా అవ (ఎవడ్రా వాడు) అంటూ అరుస్తూ కనిపించాడు జగపతి. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో జగపతి సరైన పెర్ఫామెన్స్ ఇచ్చాడంటే.. ఆయన తమిళంలోనూ బిజీ అయిపోవచ్చు. ఈ సినిమా అంచనాలు తగ్గట్లు ఆడితే ఆయన దశ తిరిగిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘భైరవ’ ప్రేక్షకుల ముందుకు రానుంది
No comments:
Post a Comment