
వరుణ్ సందేశ్.. తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్‌ల కోవలోనే యువ ప్రేక్షకుల్లోకి దూసుకొచ్చిన హీరో. ‘హ్యాపీడేస్’ సినిమాతో అతడి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’తో మరో విజయాన్నందుకుని ఆఫర్ల వెల్లువలో మునిగిపోయాడీ యువ కథానాయకుడు. ఐతే పైన చెప్పుకున్న ముగ్గురు హీరోల్లాగే చెత్త సినిమాలు ఎంచుకుని దారి తప్పాడు. చివరికి అతడి సినిమా అంటేనే ముందే ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఐతే ఇన్నాళ్లూ వరుణ్ కొత్త సినిమా ఏదైనా విడుదలకు సిద్ధమైతే.. కనీసం ఆ సినిమా వస్తున్న సంగతైనా జనాలకు తెలిసేది. కొంచెం చర్చ జరిగేది. ఈ సినిమా అయినా ఆడుతుందా.. వరుణ్‌ను నిలబెడుతుందా అని మాట్లాడుకునేవాళ్లు.
కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. వరుణ్ సందేశ్ సినిమా వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియట్లేదు. దీపావళి వీకెండ్లో వరుణ్ సినిమా ‘మిస్టర్ 420’ విడుదలైంది. ఐతే ఈ పేరుతో ఓ సినిమా వచ్చిందని కానీ.. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ హీరో అని కానీ తెలిసింది చాలా తక్కువమందికి. దీని రిలీజ్ కూడా ఏదో నామ్ కే వాస్తే అయ్యిందంటే అయ్యింది అనిపించారంతే. దీనికి దక్కిన థియేటర్లు నామమాత్రం. ఈ సినిమా టాక్ చెప్పేవాళ్లు కూడా కనిపించట్లేదు. వరుణ్ సరసన ఈ చిత్రంలో ప్రియాంక భరద్వాజ్ కథానాయికగా నటించింది. ఎస్.ఎస్.రవికుమార్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించాడు. పరిస్థితి చూస్తుంటే టాలీవుడ్లో వరుణ్ కథ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. ఈ మధ్యే పెళ్లి చేసుకుని సెటిలైన వరుణ్.. ఇక సినిమా కెరీర్ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు
No comments:
Post a Comment