
సెలబ్రిటీలు ఏదో ఒక ఉత్పత్తికి బ్రాండ్ అంబాసడర్లుగా ఉండడం ఏళ్లుగా కొనసాగుతున్న తంతే. తామున్న రంగం నుంచి భారీగా సొమ్ము అందుకుంటూనే ప్రకటనల ద్వారా జేబులు నింపుకుంటున్న నటీనటులు, క్రీడాకారులు, మోడల్స్ కు కొదువలేదు. బడా కంపెనీలకే కాక మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఉత్పత్తులకూ ప్రచారం చేసి పెడుతూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు వీరు. ఇదిలా ఉంటే, విపణిలో నిలదొక్కుకునేందుకు తయారీదారులు వాస్తవదూర ప్రకటనలు రూపొందించేందుకే మొగ్గుచూపుతున్నారు. డబ్బు వస్తుంది కదా అని సదరు ఉత్పత్తి గురించి ఏం తెలుసుకోకుండానే దానికి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లలో నటించేస్తున్నారు చాలామంది. ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం కొరడా ఝళిపించేందుకు రెడీ అవుతోంది.
తప్పుదోవ పట్టించే యాడ్స్ లో నటించిన ప్రముఖులపై ఏడాది వరకు బ్యాన్ విధించాలని సర్కార్ నిర్ణయించుకుంది. మంత్రులతో కూడిన ప్యానెల్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. సెలబ్రిటీలపై నిషేదంతో పాటూ తయారీదారులపై రూ.10లక్షల జరిమానా విధించాలని తీర్మానించింది. భారీ జరిమానాలకు తోడు రెండేళ్ల జైలు శిక్ష విధించాలన్న సూచనను కూడా కమిటీ పరిశీలించింది. అయితే జైలు శిక్ష అంశాన్ని పక్కనపెట్టి జరిమానాలతోనే ఇలాంటి ప్రకటనలకు అడ్డుకట్టవేయాలని నిర్ణయించారు మంత్రులు. మిస్ లీడింగ్ యాడ్స్ ప్రచురించే పబ్లిషర్లకూ ఈ పెనాల్టీని వర్తింపజేయాలనుకున్నా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతుందన్న భావనతో వెనక్కితగ్గారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ లో త్వరలోనే పొందుపరచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
No comments:
Post a Comment